కమ్మేస్తున్న కాలుష్యం! | - | Sakshi
Sakshi News home page

కమ్మేస్తున్న కాలుష్యం!

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

పెరుగుతున్న వాహనాలు.. తగ్గుతున్న పచ్చదనం

కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న విజయవాడ నగరంలో ఆరున్నర లక్షలకు చేరిన వాహనాలు గాలిలో పెరుగుతున్న విష వాయువులు కనిపించని వృక్షాలు, పార్కులూ అంతంత మాత్రమే ప్రమాదమేనంటున్న పర్యావరణ వేత్తలు

రీ–రేడియేషన్‌ ప్రభావం ఎక్కువే..

గాలి నాణ్యత పెంచాలి..

వాయు కాలుష్యంతో వ్యాధులు..

పెరుగుతున్న వాహనాలు.. తగ్గుతున్న పచ్చదనం

లబ్బీపేట(విజయవాడతూర్పు): పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా.. అకాల వర్షాలకు కారణం అదేనా అంటే అవుననే అంటున్నారు పర్యావరణ నిపుణులు. రెండేళ్ల కిందట వచ్చిన కుండపోత వర్షాలకు బెజవాడ సగం మునిగింది. ఇప్పుడు కూడా కాలంతో పరిమితం లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అందుకు కారణంగా అధిక కాలుష్య ప్రభావమేనని చెబుతున్నారు. ఢిల్లీ, చైన్నె, ముంబయి, హైదరాబాద్‌ నగరాల తర్వాత బెజవాడలోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని.. దీంతో భూమిపై నుంచి 15 మీటర్ల వరకూ గాలిలో వాస్తవంగా ఉండాల్సిన ఆక్సిజన్‌ కంటే తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలా పీల్చినప్పుడు విషవాయువులు అధికంగా శరీరంలోకి చేరి వ్యాధులు వ్యాపిస్తాయని.. ఊపిరితిత్తులు, గుండె, న్యూరోలాజికల్‌, నేత్ర సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్‌కు ఇవి మూలకారణంగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

600 రెట్లు పెరిగిన వాహనాలు..

ఆరోగ్యకరమైన నగరంలో ప్రతి లక్ష మంది జనాభాకు 5వేల వాహనాలు ఉండాలి. అంతకు మించి ఉంటే గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన విజయవాడ జనాభా 12లక్షలు కాగా, వాహనాలు 60వేలే ఉండాలి. కానీ ప్రస్తుతం 7 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. వీటిలో ట్రాన్స్‌పోర్టు వాహనాలు 97వేలు, మోటారు సైకిళ్లు అత్యధికంగా 5.21లక్షలు. నగరం మీదుగా జాతీయ రహదారిపై రోజుకు 40వేల వరకూ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో సిటీ బస్సుల్లో అధికశాతం 10 లక్షలకు పైగా కిలోమీటర్లు తిరిగినవే ఉన్నాయి. ఇలా కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల నుంచి సల్ఫర్‌ డై ఆకై ్సడ్‌, నైట్రిక్‌ ఆకై ్సడ్‌, కార్బన్‌ మోనాకై ్సడ్‌, కార్బన్‌ డై ఆకై ్సడ్‌ వెలువడుతోంది.

వ్యర్థం.. అనర్థం..

విజయవాడలో రోజుకు 600 మెట్రిక్‌ టన్నుల తడి–పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను రీ సైక్లింగ్‌ చేసేందుకు సైంటిఫిక్‌ డంపింగ్‌ యార్డులు లేవు. ప్రస్తుతం చెత్త సేకరణ కూడా సరిగ్గా జరగడం లేదు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాల్వగట్లు వెంబడి పడేసి ఒకేసారి కాల్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మిథేన్‌, బొగ్గు వాయువులు, కార్బన్‌ డై ఆకై ్సడ్‌ వంటివి గాలిలో కలుస్తున్నాయి. దీంతో గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గి ఇతర వాయువులు పెరుగుతున్నాయి.

బాబోయ్‌ హాట్‌ ఐల్యాండ్‌..

విజయవాడ రానున్న రోజుల్లో హాట్‌ ఐల్యాండ్‌గా మారే ప్రమాదం ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కొద్దికాలంగా నగరంలో ఎక్కడా భారీ వృక్షాలు కనిపించడం లేదు. విశాలమైన పార్కులు కుచించుకుపోయి పూల మొక్కలకే పరిమితం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వాతావరణ సమతుల్యత దెబ్బతిని ఆకస్మికంగా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు.

విజయవాడలో 20 కిలోమీటర్ల పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు వృక్షాలన్నీ కూల్చేశారు. ఎండ తీవ్రతకు వచ్చే ఉష్ణాన్ని ఇంటి శ్లాబ్‌, సీసీ రోడ్లు పీల్చుకుని, రాత్రిళ్లు వేడిని తిరిగి విడుదల (రీ రేడియేషన్‌) చేస్తున్నాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రత సాధారణంగా 28 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 32 నుంచి 34 డిగ్రీల స్థాయిలో ఉంటోంది.

జనసాంధ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో విజయవాడ ఒకటి. కానీ హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌ తరహాలో హరిత వనాలు ఇక్కడ లేవు. కాలువల సుందరీకరణ జరగలేదు. ఇక్కడ పబ్లిక్‌ వాహనాల కంటే వ్యక్తిగత వాహనాల వినియోగం ఎక్కువగా ఉన్నాయి. ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంది. దీంతో కాలుష్యం కోరలు చాస్తోంది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 60 శాతం దాటకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డిస్నీల్యాండ్‌ లాంటి ప్రాంతంలో హరిత వనాలు అభివృద్ధి చేయాలి. కొండలపై గ్రీనరీ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి.

– డాక్టర్‌ తుమ్మల శ్రీకుమార్‌,

పర్యావరణ నిపుణుడు, విజయవాడ

వాయు కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు, పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో పాటు, ఎక్కువ కాలం కాలుష్య ప్రభావానికి గురైన వారిలో జన్యుపరమైన లోపాలు తలెత్త వచ్చు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు, మెదడుపై ప్రభావం చూపి ఇతర సమస్యలు వస్తాయి. చర్మ వ్యాధులతో పాటు లంగ్స్‌ దెబ్బతినడం, హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమం.

– డాక్టర్‌ దేవనబోయిన అనిల్‌కుమార్‌, న్యూరాలజిస్ట్‌, విజయవాడ

Advertisement
 
Advertisement
Advertisement