ఆత్మలకు హక్కులు ఇలా..
వంద మందికిపైగా చనిపోయిన వారికి భూ హక్కులు కల్పించిన రెవెన్యూ అధికారులు
మళ్లీ సర్వే చేయాలి
నా భూమిని తగ్గించారు
ఆత్కూరు గ్రామానికి చెందిన రైతు గొల్లపూడి పుల్లయ్య ఇరవై ఏళ్ల క్రితం మృతి చెందారు. పుల్లయ్య చనిపోక ముందే భూ ఖాతా నంబరు 93లోని 12.17 ఎకరాలను ఇతరులకు విక్రయించారు. అయితే ఇప్పటికీ అదే భూ ఖాతా నంబరుతో 12.17 ఎకరాలకు పుల్లయ్య హక్కుదారుడిగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు రికార్డుల్లో చూపుతున్నారు. ఇది విని పుల్లయ్య కుటుంబ సభ్యులే అశ్చర్యపోయారు.
ఆత్కూరు గ్రామానికి చెందిన గుత్తా చిన్న వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు మీదు భూ ఖాతా నంబరు 102లో 4.12ఎకరాలు ఉండగా ఎకరం వరకు విక్రయించారు. ఉన్న భూమిని కుటుంబ సభ్యుల పేర్లమీదకు బదలాయించారు. వారికి పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేశారు. ఇప్పుడు పాత భూ ఖాతా నంబరుతోనే 4.12 ఎకరాలకు చనిపోయిన చిన్న వెంకటేశ్వరరావుని హక్కుదారుడిగా ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లో చూపుతూ పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
జి.కొండూరు: రెవెన్యూ అధికారుల ఒంటెత్తు పోకడ రైతులకు తలనొప్పిగా మారింది. సమగ్ర భూ రీ సర్వే పేరుతో తప్పుల తడకగా రికార్డులను తయారు చేయడంతో దశాబ్దాల క్రితం మరణించిన వ్యక్తుల ఆత్మలకు సైతం భూ హక్కులు లభించాయి. ఎవరి భూమి ఎవరి పేరు మీదకు మారిందో కూడా అర్థంకాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు తాము తాయారు చేసిన రికార్డుల ప్రకారమే పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామంటూ అధికారులు సిద్ధమయ్యారు. జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామంలో ఉన్న భూ రికార్డుల అన్నీ తారుమారు కావడం రెవెన్యూ అధికారుల వైఫల్యానికి అద్దంపడుతోంది.
తప్పుల తడకగా రికార్డులు
జి.కొండూరు మండల పరిధి ఆత్కూరు గ్రామంలో 1,524 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. అందులో ప్రభుత్వ భూమి పోనూ 1,254 ఎకరాల వరకు రైతుల పేరిట పట్టా భూమి ఉంది. అయితే ఈ గ్రామంలో గత సార్వత్రిక ఎన్నికల కోడ్ సమయంలో రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కొందరు రైతులు పాల్గొనలేదు. రీసర్వే పూర్తయిన వెంటనే ఎల్‌పీఎం నంబర్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎల్‌పీఎం నంబర్లను మూడేళ్ల వరకు ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు రూపొందించిన రికార్డుల ప్రకారం దశాబ్దాల క్రితం చనిపోయిన వ్యక్తులు, అసలు గ్రామానికే సంబంధం లేని వ్యక్తుల పేరిట భూములు ఉన్నాయి. భూమి ఉన్న రైతుకు లేనట్లు, భూమి లేని రైతుకు ఉన్నట్లు, ఒక రైతు భూమికి మరొక రైతును హక్కుదారుడిగా చూపుతూ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. రీసర్వే జరిగిన అనంతరం ఈ రెండేళ్లలో మూడు వందలకుపైగా భూ ఖాతాల్లో భూమి క్రయవిక్రయాలు జరిగాయి. వందకుపైగా భూ ఖాతాల్లో భూ యజమానులు చనిపోగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో రికార్డులను మార్చి ఇదే రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ చనిపోయిన వ్యక్తుల పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు రికార్డులను తయారు చేశారు. క్రయవిక్రయాలు జరిగిన భూమికి కొనుగోలు చేసిన వారి పేర్లతో రిజిస్ట్రేషన్‌లు పూర్తయితే పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేసిన రెవెన్యూ అధికారులు, ఇప్పుడు భూమిని విక్రయించిన రైతుల పేర్లతోనే పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులు తయారు చేసిన రికార్డుల ప్రకారం భూమి కొలతల్లో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. మరో వైపు క్రయవిక్రయాలు జరిగిన భూ ఖాతాల్లోనూ సమస్య ఉత్పన్నమవుతోంది. గ్రామంలో ప్రస్తుత రికార్డుల ప్రకారం 600 వరకు భూ ఖాతాలు ఉన్నాయి. 580కిపైగా భూ ఖాతాలు తప్పుల తడకగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆత్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి బహిష్కరించారు. గ్రామంలో రీ సర్వే మళ్లీ జరిపించి రికార్డులను సరి చేయాలని కోరారు.
మా గ్రామంలో నాకు ఖాతా నంబరు 95లో 8.5 ఎకరాలు భూమి ఉంది. అయితే ప్రస్తుతం 7.22 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రస్తుత రికార్డుల్లో చూపుతున్నారు. అంతే మొత్తం భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోసారి రీసర్వే జరిపి వాస్తవంగా ఉన్న భూమిని నా పేరున రికార్డుల్లో ఎక్కించాలి.
– కాటంనేని లక్ష్మీపతిరావు, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం
నా భర్త కనగాల వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం మరణించారు. ఆయన పేరుమీద ఉన్న 6.32 ఎకరాల భూమిని నా పేరు మీదకు బదలాయించారు. అయితే ఇప్పుడు నా పేరుతో భూ ఖాతా నంబరు 15లో 2.79 ఎకరాలను తగ్గించి 3.53 ఎకరాలు మాత్రమే ఉందని పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మిగిలిన భూమిని ఎవరికి రాశారో చెప్పాలి.
– కనగాల పద్మావతి, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం


