కొండపల్లి బొమ్మల పండుగ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కొండపల్లి బొమ్మల పండుగ ప్రారంభం

Apr 19 2026 8:23 AM | Updated on Apr 19 2026 8:23 AM

ఇబ్రహీంపట్నం: కొండపల్లి బొమ్మలు, కొండపల్లి ఖిల్లా మన వారసత్వ సంపదని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మల పండగ (సాంస్కృతిక వారసత్వ ఉత్సవం)ను కలెక్టర్‌ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం కొండపల్లి బొమ్మల ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌తో పాటు కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, కీలు బొమ్మల స్టాళ్లను సందర్శించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల వారసత్వ సంపదను భావితరాలకు వెలకట్టలేని బహుమతిగా అందించాలనే ఉద్దేశంతో బొమ్మల పండగను ఏటా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో హస్తకళల అభివృద్ధికి, హస్తకళాకారుల సంక్షేమానికి కృషిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మల తయారీలో నైపుణ్యత, సృజనాత్మక తతో నూతన ఆవిష్కరణలు చేసే వారిలో పది మందికి వచ్చే ఏడాది ఇదే రోజున రూ.50 వేలు చొప్పున రూ.5లక్షలు బహూకరిస్తామని ప్రకటించారు. ఉదయం ఖిల్లాపైకి ట్రెక్కింగ్‌ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోప్‌లతో ర్యాప్లింగ్‌ వాక్‌ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అధికారుల వైఫల్యం

వేడుకల నిర్వహణలో మునిసిపల్‌ అధికారులు విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. కలెక్టర్‌ వేదిక ఎక్కినా ప్రజలు లేకపోవడంతో అస హనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ రేగుళ్ల మల్లికార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, రీజనల్‌ డైరెక్టర్‌ వై.వి.ప్రసన్న, డీఈఓ ఎల్‌.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్‌, మెప్మా పీడీ మురళీకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ ఎ.ఎన్‌.వి.నాంచారరావు, మునిసిపల్‌ చైర్మన్‌ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement