జి.కొండూరు: చేపల మేతగా కోళ్ల వ్యర్థాలను వినియోగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా మత్స్యశాఖ అధి కారి సౌభాగ్య చక్రాణి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి తేజశ్వి హెచ్చరించారు. జిల్లాలో కోళ్ల వ్యర్థాలను చేపల మేతగా వాడు తున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 11వ తేదీన ‘గుట్టుచప్పుడు కాకుండా చల్లేస్తున్నారు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన మత్స్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. జి.కొండూరు మండలం కవులూరు శివారులో నిర్వహిస్తున్న చేపల చెరువులను సౌభాగ్య చక్రాణి, తేజశ్వి శనివారం తనిఖీ చేశారు. చెరువుల నుంచి వస్తున్న దుర్వాసనకు అధికారులే బెంబేలెత్తిపోయారు. కోళ్ల వ్యర్థాలను రవాణా చేస్తున్న రెండు వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తున్న 30 ఎకరాల్లోని మూడు చెరువులను గుర్తించి, వాటిని నిర్వహిస్తున్న ముగ్గురు, గుంటూరు జిల్లా నులకపేట నుంచి కోళ్ల వ్యర్థాలను సరఫరా చేస్తున్న వాహన డ్రైవర్ పాలపర్తి సాంబయ్య , జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మరో వాహనం డ్రైవర్ ఎస్‌కే సలీమ్, కోళ్ల వ్యర్థాలను సరఫరా చేసే శ్రీనుపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోళ్ల వ్యర్థాలను వాడితే సహించేదిలేదని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.


