కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులపై ప్రభుత్వం చిన్నచూపు ఉమ్మడి జిల్లాలో 5.62లక్షల ఎకరాల ఆయకట్టు తూటికాడ, గుర్రపుడెక్కతో పేరుకుపోయిన కాలువలు, డ్రెయిన్లు చివరి భూములకు అందని సాగునీరు ప్రతిపాదన దశ దాటని పనులు జూన్ మొదటి వారంలోపు పనులు చేయకపోతే రైతులకు కష్టాలే..
పనుల మంజూరులో జాప్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సర్కార్ తీరుతో కృష్ణా డెల్టా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో రైతులకు కడగండ్లు తప్పడం లేదు. మే నెలలోనే సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినా దానికనుగుణంగా కాలువల నిర్వహణపై ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదు. కాలువలు గుర్రపు డెక్క, తూటి కాడతో నిండిపోయాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పనులకు అనుమతులు మంజూరు చేయలేదు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సరాసరిన నియోజకవర్గానికి రూ.3కోట్ల నుంచి రూ.4కోట్లతో అంటే దాదాపు రూ.38కోట్లతో ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పనులు త్వరితగతిన చేయకుంటే తర్వాత కాలువకు నీరు విడుదల చేస్తే పనులు చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత పనులు మంజూరైనా పనులు చేయకుండా మమ అనిపించి నిధులు మింగేసే అవకాశం ఉంది. వర్షాలు వస్తే డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకు పోక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసినా చివరి ఆయకట్టుకు నీరు అందని దుస్థితి నెలకొంటుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది.
అధ్వానంగా కాలువలు
ప్రధానంగా చంద్రయ్య డ్రెయిన్‌లో పనులకు రూ.22కోట్లు, కొమరవోలు డ్రెయిన్ మరమ్మతులకు రూ.11కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు పనులు చేయకపోతే వర్షాకాలంలో చేయలంటే ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలో పూడిక తీయక పోవడంతో అధ్వానంగా మారి పంట పొలాలు మునుగుతున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క, తూటుతో మేట వేసుకుపోయాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్‌ఎస్ మేజర డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలో లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకొడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్‌ఎన్ పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి..
కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా..
కాలువ కృష్ణా ఎన్టీఆర్
బందరు 1.51లక్షల –
ఎకరాలు
కేఈబీ 1.38 –
ఏలూరు 0.56 1,332 వేల ఎకరాలు
రైవస్ 2.17 425
మొత్తం 5.62 లక్షల 1,757 వేల
ఎకరాలు ఎకరాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10లక్షల వరకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది కృష్ణా తూర్పు, కృష్ణా సెంట్రల్, డ్రెయినేజీ విభాగం, స్పెషల్ డివిజన్లో 650 పనులకు సంబంధించి రూ.26.03 కోట్లు మంజూరు చేశారు. కాలువలకు నీటి విడుదల తర్వాతే పనులు మంజూరు చేయడంతో, నీటి సంఘాల అధ్యక్షులు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మకై నామ మాత్రంగా పనులు చేపట్టి, మమ అనిపించారు.


