నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి మల్లవల్లి పారిశ్రామికవాడ సందర్శన ప్రకృతి సాగుతో నాణ్యమైన దిగుబడులు దుర్గమ్మ సేవలో..

కంకిపాడు: పెండింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు ఆదేశించారు. కంకిపాడు పోలీసుస్టేషన్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీసుస్టేషన్‌ భవన నిర్మాణ పనులను గురువారం రాత్రి ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు పరిశీలించారు. నిర్మాణ పరమైన అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ నాయుడు మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని విభాగాలకు అధునాతన వసతులు సమకూరాలని సూచించారు. పోలీసుస్టేషన్‌ నిర్మాణ పనుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.సందీప్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా పారిశ్రామికవాడలో శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యం అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ మోడల్‌ ఇండ్రస్టీయల్‌ ఎస్టేట్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామికవాడలో పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ఏర్పాటు, చోరీల నియంత్రణ, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, మహిళా ఉద్యోగులపై వేధింపులు వంటి పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ మహిళా ఉద్యోగులు, కార్మికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఐ ఎల్‌.రమణ, వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్‌ పాల్గొన్నారు.

నందిగామ రూరల్‌: జిల్లాలో 35,945 మంది రైతులతో 42,088 ఎకరాలలో సాగు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని కంచల గ్రామంలోని తత్వవనంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ముందుగా మామిడి తోటలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తర్వాత పీఎండీఎస్‌ (ప్రీ–మాన్‌ సూన్‌ డ్రై సోయింగ్‌) విత్తనాలు, విత్తన గుళికల తయారీని తెలుసుకుని ఐదు ఎకరాలలో విత్తనాలు నాటడాన్ని ప్రారంభించారు. ఆర్డీవో పోశిబాబు, తహసీల్దార్‌ సురేష్‌ బాబు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ అంజిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ ఎక్స్‌అఫీషియో సెక్రటరీ డాక్టర్‌ ఎం. హరిజవహర్‌లాల్‌ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన హరిజవహర్‌లాల్‌ను అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. అనంతరం మహామండపం రెండో అంతస్తులో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. అన్న భక్తులతో కలిసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణపై పలు సూచనలు చేశారు. తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణకు ఆయన విరాళాన్ని అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement