సీఎం ఇచ్చిన హామీకే అతీగతి లేదు | - | Sakshi
Sakshi News home page

సీఎం ఇచ్చిన హామీకే అతీగతి లేదు

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

సీఎం ఇచ్చిన హామీకే అతీగతి లేదు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

పింఛన్ల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న అర్హులు కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించని వైనం రెండేళ్లుగా మంజూరవని కొత్త పింఛన్లు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తప్పని అవస్థలు సాక్షాత్తూ ముఖ్యమంత్రి హామీకే అతీగతీ లేదు

ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు అంటూ హామీలు ఇచ్చారు. కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. నేరుగా పేదలను కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. పింఛన్లకు ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభించి పేదలను ఆదుకోవాలి.

– కామరాజ్‌ హరీష్‌,

ప్రధాన కార్యదర్శి, బీసీఎస్‌ఎఫ్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ కూటమి నాయకులు ఊదరగొట్టారు. సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని, అర్హులు అందరికీ లబ్ధి చేకూరుస్తామని గొప్పల డప్పు కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్‌ మంజూరు చేయలేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించలేదు. పెన్షన్‌ వస్తూ భర్త చనిపోయిన వారికి స్పౌజ్‌ కేసు కింద ప్రభుత్వం పింఛనుకు అవకాశం కల్పించి చేతులు దులుపుకొంది. కొత్త పింఛన్‌ కోసం పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేద్దామని వెళ్లిన వారికి రిసెప్షన్‌లో చేదు అనుభవం ఎదురవుతోంది. పింఛన్‌ మాటెత్తగానే అసలు అర్జీలు తీసుకోకుండా వెనక్కు పంపుతున్నారు. పక్షవాతంతోనో, ప్రమాదాల్లో, ఇతర కారణాలతో కాళ్లు పోయి మంచానికే పరిమితమైన వారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. మందులు, ఆహారం కూడా సమకూర్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు పింఛన్లు మంజూరు కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ మంజూరు చేసి తమను ఆదుకోవాలని ఎంతో ఆర్తిగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రావడం లేదు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 2,36, 237 పెన్షన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వంలో 2,26, 775 పింఛన్లు ఇస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌ పింఛన్లలో కోత వేసింది.

అమలుకు నోచని 50 ఏళ్లకే పింఛన్‌ హామీ

అధికారంలోకి వస్తే 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు.

ఈ రెండేళ్లలో యాభై ఏళ్లు దాటిన వారు సామాజిక భద్రత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రకటించిన జిల్లా బడ్జెట్‌లో పెన్షన్లకు ప్రత్యేక కేటాయింపులు జరగలేదు. దీన్ని బట్టి ఈ ఏడాది కూడా కొత్త పింఛన్ల మంజూరు లేనట్లేనని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

హాకర్లు, పేదల బాగోగులు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు దీపావళి పండుగ రోజు బీసెంట్‌ రోడ్డులో పర్యటించారు. దుర్గారావు అనే వ్యక్తికి పింఛన్‌, ఇళ్లు, జీవనోపాధి కల్పిస్తానని స్వయంగా హామీ ఇచ్చారు. ఇది జరిగి నెలలు గడస్తున్నా దుర్గారావుకు పింఛన్‌ మంజూరు కాలేదు. తనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, పింఛన్‌ మంజూరు చేయా లంటూ అధికారుల చుట్టూ ఆనాటి ఫొటోలను చూపినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తనకు చంద్రబాబు రూపంలో కొండంత అండ దొరికిందని సంబర పడ్డానని, అయితే ఆయన ఇచ్చిన హామీనే అమలు చేయడంలేదని, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని దుర్గారావు వాపోయారు. దుర్గారావు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement