రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీసు శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చోట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో గురువారం ‘పీఎం–రాహత్’ పథకం అమలు–ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాలతో గాయపడే వారికి తక్షణం ఉన్నత వైద్యాన్ని అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పీఎం రాహత్ పథకం క్షతగాత్రులకు ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలోగా ఉచితంగా రూ.1.5 లక్షల వైద్యాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 656 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పీఎం రాహత్ కింద సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలో కనీసం 1,500 ఆస్పత్రుల్లో పీఎం–రాహత్ కింద వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధంపై అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు (రోడ్డు సేఫ్టీ) నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ రఘునందన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రవాణాశాఖ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బోస్, ఆషా అధ్యక్షులు డాక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో డిసీజ్ మానిటరింగ్ కేంద్రం
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల సాధన కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ర్యాంకింగ్ రావడం వల్ల వైద్య కళాశాలలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రూ.6 కోట్లతో ఏర్పాటు కాబోతున్న డీఎండీసీ (డిసీజ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సెంటర్) కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ లాన్సెట్ వంటి అంతర్జాతీయ స్థాయి జర్నల్స్‌లో రాష్ట్ర వైద్యుల పరిశోధన పత్రాలు ప్రచురితం జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయిసుధీర్, లక్ష్మీ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు.


