యనమలకుదురు ఆలయ అర్చకులకు బెయిల్‌ | - | Sakshi
Sakshi News home page

యనమలకుదురు ఆలయ అర్చకులకు బెయిల్‌

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

పెనమలూరు: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో అర్చకులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఈవో ఎన్‌.భవాని, అర్చకులు సాగర్‌, పూర్ణ, ఉద్యోగి రోశయ్య స్వాహా చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అర్చకులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.50 వేలు రికవరీ కూడా చేశారు. ఈవో ఎన్‌.భవాని ముందస్తు బెయిల్‌ తీసుకోగా మిగతా ముగ్గురు అరెస్టు కావటంతో అవనిగడ్డ జైలుకు వెళ్లారు. ఇద్దరు అర్చకులు, ఒక ఉద్యోగికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈవో, అర్చకులు సస్పెన్షన్‌లో ఉన్నారు.

విచారణ పూర్తి

ఆలయంలో జరిగిన అవినీతిపై గత కొద్ది రోజులుగా ఐదుగురితో కూడిన కమిటీ చేసిన విచారణ పూర్తైంది. ఆలయంలో రికార్డులు తనిఖీ చేశారు. విచారణ నివేదికను ఎండోమెంట్‌ కమిషనర్‌కు సమర్పిస్తారు. అయితే ఆలయంలో ఆభరణాలపై భక్తుల సమక్షంలో బహిరంగ విచారణ చేయాల్సి ఉంది. స్వామివారి ఆభరణాలు ఉన్నాయా... స్వాహా చేశారా అనే విషయం తేలాలి.

పోలీసులకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఫిర్యాదు

గన్నవరం: సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ గురువారం స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఒక ప్రైవేట్‌ సమావేశానికి సంబంధించిన దృశ్యాలను అనధికారికంగా రికార్డు చేయడంతో పాటు ఆడియో, వీడియో మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అసభ్యకరంగా చిత్రీకరించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని

యువకుడు దుర్మరణం

గన్నవరం: సూరంపల్లి శివారు రామచంద్రపురం వద్ద జాతీయ రహదారి బైపాస్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం... పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఇల్లూరి జగదీష్‌(27) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన జగదీష్‌ బుధవారం బైక్‌పై హనుమాన్‌ జంక్షన్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం తిరిగి కానూరు వస్తుండగా బైపాస్‌ రోడ్డులో రామచంద్రపురం వద్ద టోల్‌గేట్‌ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో జగదీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement