రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో గురువారం రైల్వే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా 2025–26లో డివిజన్ సాధించిన పురోగతిని వివరించారు. రికార్డు స్థాయిలో రూ. 5,939 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, 40.64 మిలియన్ టన్నుల అత్యధిక సరుకు రవాణాను సాధించడం డివిజన్‌కు గర్వకారణమని కొనియాడారు. రైళ్ల సమయపాలన 87 శాతానికి మెరుగుపడిందని పేర్కొన్నారు. డివిజన్‌లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించడం, మూడవ లైన్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వేగపరిమితులను తొలగించడం, పెద్ద ఎత్తున ట్రాక్ పునరుద్ధణ వంటి కీలక విజయాలను సాధించామన్నారు. రద్దీ నివారణకు డివిజన్ మీదుగా ఐదు వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. ఈ సందర్భంగా విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 58 ఉద్యోగులకు రైల్ సేవా పురస్కారాలు, 12 మంది ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీపీఓ ప్రేమ్‌కుమార్ లకావత్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


