లబ్బీపేట(విజయవాడతూర్పు): పెన్షనర్ల సామాజిక భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని బీఎస్‌ఎన్‌ఎల్ ఎంటీఎన్‌ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.వరప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గుట్టుగా తెచ్చిన వ్యాలిడేషన్ చట్టంతో దేశంలోని కోటి మంది పెన్షనర్లకు ముప్పు పొంచి ఉందని, ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం మహాత్మాగాంఽధీరోడ్డులోని పీ అండ్ టీ క్వార్టర్స్ ప్రాంగణంలో పెన్షనర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాలిడేషన్ ఆఫ్ సీసీఎస్ పెన్షన్ నిబంధన చట్ట సవరణను రద్దు చేయాలని, ఎనిమిదో వేతన సవరణ కమిషన్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి. అశోక్‌బాబు, సర్కిల్ కన్వీనర్ ఎన్.రామారావు, జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు, సుంకు సుబ్బారావు, భానుబాబు, కోటేశ్వరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్‌సీ బోస్ తదితరులు పాల్గొన్నారు.


