పేదల ఇళ్లపైకి మరోసారి బుల్డోజర్‌ | - | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లపైకి మరోసారి బుల్డోజర్‌

Apr 16 2026 12:11 PM | Updated on Apr 16 2026 12:11 PM

పెనమలూరు/కంకిపాడు: కూటమి పాలకులు పేదల ఇళ్లపై కన్నెర్ర చేశారు. గోసాల–వణుకూరు రోడ్డులో ఉన్న పేదల ఇళ్లు బుధవారం నేలమట్టం చేశారు. పెద్ద ఎత్తున బుల్డోజర్లు తీసుకు వచ్చి విచక్షణారహితంగా ఇళ్లను కూల్చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఉండటానికి పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దించి బందోబస్తు పెట్టారు. ఏళ్లుగా ఉంటున్న ఇళ్లు కళ్ల ఎదుటే నేలమట్టం చేయటంతో బాధితులు బోరున విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని గోసాల–వణుకూరు ఆర్‌ అండ్‌బీ రోడ్డు పక్కనే గత 40ఏళ్లుగా చాలా మంది పేదలు ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే టీడీపీ నేతల కళ్లు పేదల ఇళ్లపై పడ్డాయి. దీంతో నాలుగు రోజుల క్రితం బుల్డోజర్‌లతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేయాలని యత్నించారు. దీంతో వైఎస్సార్‌ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి అడ్డుకున్నారు. పేదలను రోడ్డు పాలు చేస్తే సహించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్‌ చేయడంతో ఇళ్ల కూల్చి వేత ఆగింది.

తెల్లవారుజామునే కూల్చివేత..

అయితే రెవెన్యూ, పోలీసు ఒక్కసారిగా బుధవారం ఉదయాన్నే హఠాత్తుగా రంగంలోకి దిగారు. గోసాల రోడ్డులో ఉన్న దాదాపు 25 పేదల ఇళ్లను బుల్డోజర్‌లతో కూల్చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా దాదాపు 100 పోలీసులు పహారా కాశారు. ఒక్కసారిగా బుల్డోజర్లు వచ్చి ఇళ్ల పై పడి కూల్చివేయటంతో నిద్రమత్తులో ఉన్న పేదలు ఉలిక్కిపడ్డారు. తమకు న్యాయం చేయాలని పేదలు వేడుకున్నా అధికారులు మనసు కరగలేదు. కాకీలను అడ్డు పెట్టుకుని మొత్తం ఇళ్లన్నీ నేలమట్టం చేయటంతో పేదలు ఆర్తనాదాలు పెట్టారు. పేదలకు తమ ఇళ్ల వద్ద కూడా ఉండనీయలేదు. గోసాల రహదారి పోలీసులు మూసివేశారు.

రియల్టర్ల కోసమేనా?

రోడ్డు ఆక్రమణలు తాము తొలగించామని, ఇక్కడి పేదలకు వేల్పూరులో ఇళ్ల స్థలాలు ఇచ్చామని రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే గోసాలకు వేల్పూరు చాలా దూరమని తాము అక్కడికి వెళ్లి ఏమి చేయాలని బాధితులు కంటతడి పెట్టారు. ఇక్కడ పనులు చేసుకునే తాము వేల్పూరుకు వెళ్లలేమని చెప్పినా వినలేదన్నారు. కేవలం రియల్టర్ల వ్యాపారం కోసమే పేదల ఇళ్లు నేలమట్టం చేశారని ఆరోపిస్తున్నారు.

గోసాలలో 25 ఇళ్లు నేలమట్టం

Advertisement
 
Advertisement
Advertisement