ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్‌ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్, 180 థాయిలాండ్ బాత్స్, 200 ఓమన్ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్‌టౌన్ పోలీసులు, ఎస్‌పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు.
తప్పుడు ప్రచారాలను అరికట్టాలని ఫిర్యాదు
చిలకలపూడి(మచిలీపట్నం): సోషల్ మీడియా, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోరారు. వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి ఆయన అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడుకు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వంశీమోహన్ మాట్లాడుతూ.. సామాజిక మాధ్య మాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ దెబ్బతీయడానికి కొంత మంది కుయుక్తులు పన్నుతున్నారని, వారి పోస్టుల వెనుక ఉన్న వారి కోసం విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు చెస్ ఆడటం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయని దీని వల్ల విద్యలో కూడా రాణిస్తారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ చెప్పారు. స్థానిక కానూరులోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో త్వరలో జరగునున్న ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం జరిగాయి. బాల బాలికలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 24 మంది క్రీడాకారులను ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపిక చేశామని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్ చెప్పారు. స్కూల్ సీఈవో కె.జాహ్నవితో పాటుగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో నియామకాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ హోదాల్లో నియమించారు. రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా చలమాల నాగ సత్య నారాయణరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వానపల్లి సీతాదేవి నియమితులయ్యారు.
జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో..
ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్య దర్శిగా వంగూరి కుమారి, ఇంటలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఇమ్మడి మురళీ కృష్ణ, మైనార్టీ సెల్ కార్యదర్శిగా షేక్ గౌస్ జానీ, సోషల్ మీడియా వింగ్ కార్యదర్శులుగా నల్లమోతు సురేష్‌బాబు, షేక్ మాబూ సుభాని నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.


