అగ్గి రాజేసిన ప్రొటోకాల్‌ రగడ | - | Sakshi
Sakshi News home page

అగ్గి రాజేసిన ప్రొటోకాల్‌ రగడ

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

ఏఎంసీ చైర్మన్‌ పేరు లేదని ఆయన వర్గీయులు బైఠాయింపు

ప్రారంభోత్సవ ఫలకాన్ని కాలువలో పారేసేందుకు యత్నం

అన్న క్యాంటీన్‌ వద్ద విక్కుర్తి శ్రీనివాస్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొలగించే యత్నం

సారీ చెప్పిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ: అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవం రసా భాసగా మారింది. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఏఎంసీ చైర్మన్‌ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు బైఠాయించి ఆందో ళన చేశారు. శిలాఫలకాన్ని లాగేసి కాలువలోకి పారేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, టీడీపీ నాయకుల మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది. అన్న క్యాంటీన్‌ భవనం గోడకు ఆనుకుని టీడీపీ నేత విక్కుర్తి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఈ ఫ్లెక్సీని తొలగించాలని పంచాయతీ, రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఫ్లెక్సీలో చంద్రబాబు, ఎన్టీఆర్‌ బొమ్మలు ఉండటంతో ఫ్లెక్సీ తీస్తే సహించేది లేదని కొందరు టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం కొంత ఆలస్యమైంది. అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవం శిలాఫలకంపై ఏఎంసీ చైర్మన్‌ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడం గమనించిన టీడీపీ నేతలు రావి నాగేశ్వరరావు, మెండు లక్ష్మణరావు (చంటి) శిలాఫలకం ముందు బైఠాయించి ఆందో ళన చేశారు. అనంతరం కొంతమంది ఈ శిలాఫ లకాన్ని లాగేసి పంటకాలువలో పారేసేందుకు యత్నించారు. వారిని గమనించిన టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఈ శిలాఫలకాన్ని లాక్కుని భవనం దగ్గరకు తీసుకెళ్లారు. ఏఎంసీ చైర్మన్‌ పేరు లేకుండా శిలాఫలకం వేయడానికి వీలులేదని కొల్లూరు వర్గీయులు నినాదాలు చేశారు. కలెక్టర్‌, తహసీల్దార్‌కు వచ్చిన ప్రొటోకాల్‌ జాబితాలో ఏఎంసీ పేరుందని, కావాలనే ఆయన పేరుని తొలగించారని కొల్లూరి వర్గీయులు ఆరోపించారు. దీంతో కనపర్తి కలుగ జేసుకుని శిలాఫలకాన్ని తీసేసి ఏఎంసీ చైర్మన్‌ పేరు వేయించి మరో శిలాఫలకం ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఆందో ళనకారులు వెనక్కి తగ్గారు. అనంతరం కలెక్టర్‌ డీకే బాలాజీ, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ప్రొటోకాల్‌ విషయంలో పొరపాటు జరిగిందని, అందుకు క్షమించాలని సభావేదికపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ ప్రకటించడంతో కొల్లూరి వర్గీయులు శాంతించారు. ఈ ఘటన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌, టీడీపీ నేతల మధ్య అగ్గి రాజేసినట్టయిందని కొంతమంది బాహాటంగానే చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement