నేటి నుంచి స్వీయ గణన నగారా | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి స్వీయ గణన నగారా

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

నేటి నుంచి స్వీయ గణన నగారా

వివరాలు వెల్లడించిన

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జన గణన – 2027లో తొలి దశలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) జరుగుతుందని.. ఇందులో ప్రజలు కీలకభాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ కోరారు. బుధవారం కలెక్టరేట్‌ శ్రీ ఏవీఎస్‌ రెడ్డి హాల్‌లో జనగణనపై జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో స్వీయ గణన వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజాభాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు.

ఇలా చేయాలి..

ఎస్‌ఈ.సెన్సస్‌.డాట్‌.జీఓవీ.ఇన్‌ పోర్టల్‌ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు. దీనివల్ల సమయం ఆదాతో పాటు దోష రహితంగా కచ్చితమైన డేటా లభిస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల ఎన్యూమరేటర్‌ భౌతిక పరిశీలనకు వచ్చినప్పుడు స్వీయ గణన ద్వారా అందించిన డేటాను త్వరితగతిన ధ్రువీకరించేందుకు వీలవుతుందన్నారు. బిల్డింగ్‌ నంబరు, కుటుంబంలో మొత్తం సభ్యులు, ఇంటి యాజమాన్య స్థితి, తాగునీటికి ప్రధాన వనరు, ఇంటర్నెట్‌ సౌకర్యం, టీవీ సౌకర్యం ఇలా మొత్తం 34 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు స్వీయ గణన ద్వారా స్వచ్ఛందంగా అందించవచ్చన్నారు.

15 రోజుల పాటు..

15 రోజుల అవుట్‌రీచ్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో వర్గం లక్ష్యంగా స్వీయ గణనపై ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్‌ లక్ష్మీశ వివరించారు. ఏప్రిల్‌ 16న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను స్వీయ గణనలో భాగస్వామ్యం చేస్తామన్నారు. అదేవిధంగా 17వ తేదీన సచివాలయ సిబ్బంది, హెచ్‌వోడీ కార్యాలయాల సిబ్బంది, జిల్లా కార్యాలయాల సిబ్బంది, మండల కార్యాలయాల సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా ఏప్రిల్‌ 30 వరకు వివిధ వర్గాల ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ లక్ష్మీశ కోరారు. సమావేశంలో మెజిస్టీరియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ఎం. వెంకట రామయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement