
పంట పొలాల్లోకి వరద నీరు
పెనమలూరు: కృష్ణానదిలో సోమవారం దాదాపు 6.5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం గ్రామాల్లో వరద నీరు పంట పొలాల్లోకి వచ్చాయి. ప్రస్తుతానికి పంటలకు ఇబ్బంది లేకపోయినా వరద నీరు ఇంకా పెరిగితే పంటలు నీట మునిగే పరిస్థితి ఉందని రైతులు తెలిపారు. పసుపు, కంద, వరి, కూరగాయల పంటలకు ప్రమాదం పొంచి ఉంది. పల్లపు ప్రాంతాల్లో వరద నీరు ఇప్పటికే ఇళ్ల వద్దకు చేరుకుంది. వరద ఉధృతి పెరిగితే వరద నీరు నేరుగా ఇళ్లను ముంచెత్తే ప్రమాదం ఉంది. పెదపులిపాక, యనమలకుదురు ప్రాంతాల్లో కరకట్ట దిగువన ఉన్న నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. వరద నీరు పెరుగుతుండటంతో పంట పొలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.