
తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను జీఎస్టీ –2.0తో తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు లభిస్తున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ రత్నాచార్యులు ముద్రించిన వాల్‌పోస్టర్లను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం పద్ధతిలో సాగు చేపట్టే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు తక్కువ ధరకే లభిస్తాయని, ఆ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గిందని. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 2.5 శాతం తగ్గింపుతో పరికరాలను అందిస్తోందన్నారు. జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె.స్వాతి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి పాల్గొన్నారు.
రవాణాశాఖ అవగాహన ర్యాలీ
ధరల తగ్గింపుపై రవాణాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ –2.0 ద్వారా వాహనాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయని, వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, జిల్లా రవాణాధికారి యూ ఎన్‌ఎస్ శ్రీనివాసరావు, కమర్షియల్ డెప్యూటీ కమిషనర్ రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.