
పొంగి పొర్లుతున్న చంద్రమ్మ కయ్య
జగ్గయ్యపేట: ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం మండలంలోని ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు నుంచి 5.69 లక్షల క్యూసెక్కుల వరద నీటిని 16 గేట్‌ల ద్వారా విడుదల చేస్తుండటంతో మండలంలోని కృష్ణానది పరివాహక గ్రామాలైన ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గ్రామాలలో కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ముక్త్యాల–జగ్గయ్యపేట రహదారిలోని చంద్రమ్మ కయ్య పొంగి పొర్లుతుండటంతో రెండవ రోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కేసీపీ కర్మాగారంలో నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రావిరాల బీసీ కాలనీ ప్రజలు రెండవ రోజు కూడా పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్నారు. ముక్త్యాల, రావిరాల, కె.అగ్రహారం గ్రామాలలోని పత్తి, మిర్చి పంటలు వరద నీటిలో మునిగాయి. మరో మూడు రోజుల పాటు వరద ఉధృతి ఉంటుందని అధికారులు చెబుతుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు సూచనలు చేస్తున్నారు.

పొంగి పొర్లుతున్న చంద్రమ్మ కయ్య