
సమ్మెలోకి పీహెచ్‌సీ వైద్యులు
ఓపీ సేవలు బంద్ అత్యవసర సేవలకు మినహాయింపు సర్వీస్ వైద్యుల పీజీ కోటా తగ్గింపుపై ఆగ్రహం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు వైద్యసేవలు దూరం
మచిలీపట్నంఅర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ (ఏపీపీహెచ్‌సీడీఏ) ప్రకటించింది. ఈ నెల 26 వ తేదీ నుంచి పీహెచ్‌సీ డాక్టర్లు దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టరు బాలాజీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.వెంకట్రావులకు సంఘం తరఫున జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీ వైద్యులు సమ్మె చేపట్టారు.
పీజీ కోటా తగ్గింపుపై ఆగ్రహం
సర్వీస్ వైద్యుల పీజీ కోటాను తగ్గించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంపై డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ సీట్లు ఉండగా, వాటిని 15 శాతానికి తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు తక్కువ కాలంలోనే ప్రమోషన్లు లభిస్తుంటే, 20 ఏళ్లుగా పీహెచ్‌సీల్లో పని చేస్తున్న డాక్టర్లు ఇంకా సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 49 పీహెచ్‌సీలు, 14 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో దాదాపు 110 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న సమయంలో సమ్మె ప్రారంభం కావడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
వైద్యుల డిమాండ్లు
వైద్యుల ప్రధాన డిమాండ్లలో పీజీ కోటాను పునరుద్ధరించడం, టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించడం, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్‌పై 50 శాతం అలవెన్స్ ఇవ్వడం, చంద్రన్న సంచార చికిత్స పథకానికి ప్రత్యేక భృతి కేటాయించడం ఉన్నాయి. అదనంగా అర్బన్, నేటివిటీ కౌన్సెలింగ్ గడువును ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించాలని కోరుతున్నారు.
సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం
ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో కార్యక్రమాలు, వరదలు, విపత్తుల సమయంలోనూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఉద్యోగోన్నతులు అందకపోవడం వైద్యులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. జాయిన్ అయినప్పుడు ఉన్న అదే కేడర్లో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమ సేవలకు సరైన గుర్తింపు లభించడం లేదని పీహెచ్‌సీ వైద్యులు ఆరోపిస్తున్నారు.