
విమానాశ్రయంలో కెఫే స్టాల్ ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. స్థానిక విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉడాన్ యాత్రి కెఫే స్టాల్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం విమానాశ్రయ ఆవరణలో ఎంపీ కేశినేని శివనాథ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయాల్లో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటు ధరల్లో టీ, కాఫీ, స్నాక్స్ విక్రయించేందుకు ఉడాన్ యాత్రి కెఫేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణికుల వృద్ధి రేటు 15 శాతం పెరిగిందన్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త విమాన సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు మరో నెలలో విమాన సర్వీస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా అహ్మదాబాద్, వారణాసి, కొచ్చి, పుణేకు సర్వీస్‌లు నడపనున్నట్లు చెప్పారు. ఏడాదికి 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో నూతన టెర్మినల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఉడాన్ యాత్రి కెఫే స్టాల్ మెనూ కార్డును ఆయన ఆవిష్కరించారు. ఏఏఐ బోర్డు సభ్యులు డాక్టర్ హెచ్.శ్రీనివాస్, డాక్టర్ శరద్‌కుమార్, విమానాశ్రయ సలహా కమిటీ సభ్యుడు పొట్లూరి బపసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామాచారి, ఎయిర్‌పోర్ట్ డెరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, పలువురు ఎయిర్‌పోర్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.