
విజయవాడ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దాంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రధానంగా రాగల మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఎవరూ చెట్ల కింద నిలబడరాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రేపు(అక్టోబర్ 1వ తేదీ) బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఎల్లుండికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఆతరువాత పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి దక్షిణఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రేపు ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.