
కృష్ణమ్మ కన్నెర్ర
కృష్ణా కలెక్టరు పర్యటన..
ఏటిపాయకు భారీగా వచ్చిన వరద లంక గ్రామాలను చుట్టుముట్టింది. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో నివాసం ఉంటున్న వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా గ్రామాల్లోని నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు శివారు తోడేళ్లదిబ్బ లంక, వల్లూరుపాలెం శివారు రావిచెట్టు లంక, పాములలంక, తుమ్మలపచ్చిక లంక, చాగంటిపాడు శివారు పిల్లివానిలంక, దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంక, ఐలూరు శివారు కనిగిరిలంక, ములకల లంక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి.
కాసరనేనివారిపాలెం వద్ద నీట మునిగిన శివాలయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/కంకిపాడు: ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండు రోజులుగా బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి అంత కంతకూ పెరుగుతోంది. దీంతో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇందులో 6,39,737 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలివేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. వరద కారణంగా నది పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి..
ఏడిపిస్తున్న ఏటిపాయ..
పెనమలూరు, పామర్రు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. గతేడాది సెప్టెంబర్ ఏటిపాయకు వరద భారీగా రావటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరలా ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే వరద ముంచుకురావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ రోజులు వరదనీరు పంట పొలంలో నిలిచిపోతే పంటలు కుళ్లిపోయే ఆస్కారం ఉందని వాపోతున్నారు.
అయ్యో ఎడ్లంక..
దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి వరదచొచ్చుకొచ్చింది. దీంతో రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలకు నిలిచిపోయాయి. ఇక్కడి పలు నివాసాల్లోకి సైతం నీరు చేరటంతో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. దీంతో నివాసితులు సామాన్లను తరలించి భద్రపర్చుకుంటున్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అవనిగడ్డ మండలంలోని పలు ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం విస్తృతంగా పర్యటించారు. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు. పులిగడ్డ, పల్లెపాలెం ప్రాంతాల్లో వరదను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కృష్ణమ్మ కన్నెర్ర

కృష్ణమ్మ కన్నెర్ర