
దుర్గమ్మ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు
సాక్షి,అమరావతి: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడటం హేయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆలయాల వద్ద రాజకీయాలు మాట్లాడకూడదని కనీస ఇంగిత జ్ఞానం సీఎం చంద్రబాబుకి లేదా అని ఆయన ప్రశ్నించారు. పైగా అమ్మవారి సమక్షంలోనైనా నిజాలు మాట్లాడకుండా సీ్త్రశక్తి పథకం సూపర్ హిట్ అని పచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం మల్లాది విష్ణు మీడియాకు ఒక వీడియోను రిలీజ్ చేశారు.
ఉచిత బస్సు పచ్చి మోసం..
ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని హామీ ఇచ్చిన చంద్రబాబు గతేడాది పథకాన్ని అమలు చేయలేదని మల్లాది గుర్తు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తూ కేవలం 5 రకాల బస్సులకే వర్తింపజేసి మహిళలను తీవ్రంగా వంచించారన్నారు. రాష్ట్రంలో 11,256 బస్సులుంటే సగం బస్సులకు కూడా పథకం వర్తించడం లేదని చెప్పారు. అంతర్ జిల్లాలకు, ఎక్కువ దూరం ప్రయాణించే సూపర్ లగ్జరీ, వెన్నెల, గరుడ, వెన్నెల వంటి బస్సులకు పథకం వర్తించడం లేదన్నారు. తూతూమంత్రంగా పథకాన్ని అమలు చేసి దాదాపు 2కోట్ల మంది మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన దానికి భిన్నంగా ఆంక్షలతో పథకాన్ని వర్తింపజేయడమే తప్పయితే, అమ్మవారి సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకి దేవుళ్లన్నా భయం లేదు, భక్తి లేదని చెప్పడానికి నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు.