
కారు ఢీకొని మహిళ మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా పామూరు మండలం, మార్కొండపురం గ్రామానికి చెందిన రాగిపిండి విజయదుర్గ (35), చంద్రశేఖర్‌రెడ్డి భార్యాభర్తలు. వారు మరమరాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. వారి కుమారుడు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో ఒక ప్రైవేట్ ఇంటర్మీడియెట్ కళాశాలలో చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు భార్యాభర్తలు ఇద్దరు శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బందరురోడ్డులోని వివంతా హోటల్ వద్దకు ఆదివారం తెల్లవారుజాము ఒంటి గంట సమయంలో చేరుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఆటో దిగి డ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా విజయదుర్గ లగేజీ తీసుకుంటూ ఆ వాహనంలోనే ఉండిపోయింది. అదే సమయంలో బెంజిసర్కిల్ వైపు నుంచి కంట్రోల్ రూమ్ వైపు అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో కొంచెం ముందుకు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆటోలో ఉన్న విజయదుర్గ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోడ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి నైతిక హక్కు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజ్యాంగ బద్ధంగా విశ్రాంత ఉద్యోగులకు కల్పించిన హక్కుల పరిరక్షణకు పెన్షనర్లందరూ సమష్టిగా కృషి చేయాలని విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సి.పి.రావు అన్నారు. ఆదివారం విజయవాడ గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగిన ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సె్‌స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఐదో సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ పొందటం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నైతిక హక్కు అన్నారు.మరో అతిథి విశ్రాంత కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బి.హరేరామ్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు సమాజంలో గౌరవంగా బతకడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1871లో పెన్షన్ పథకాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేశారు. సమావేశంలో సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్, పెన్షనర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గద్దె తిలక్, టి.వివేకానంద తదితరులు మాట్లాడారు. అనంతరం 75 ఏళ్లు నిండిన పెన్షనర్లను సత్కరించారు. క్రీడల్లో మెడల్స్ సాధిస్తున్న విశ్రాంత ఉద్యోగి కరాడే శివ ప్రసాదరావుకు జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో సెంట్రల్ జీఎస్టీ అసి స్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, రవి కుమార్, పెన్షనర్ల సంఘ నాయకులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సూచించారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఆరో జాతీయ జూనియర్, సీనియర్– సీ యోగాసన చాంపియన్‌షిప్ పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ నగరంలో జాతీయ స్థాయి యోగాసన పోటీలు జరగడం విజయవాడకు గర్వకారణమన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 1,500 మందికి పైగా హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రదర్శించిన యోగ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.