
అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై అక్టోబర్ ఏడో తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సుంద రయ్య, డాక్టర్ రాజు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ధర్నా పోస్టర్, ఆవిష్కరణ, జిల్లా స్థాయి సమావేశం జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన డెప్యూటీ సెక్రటరీ జనరల్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అప్‌లోడ్, డౌన్‌లోడ్, బయోమెట్రిక్, మెగా పీటీఎం, యోగాంధ్ర, పరీక్షలు బుక్స్‌లో రాయటం, గ్రీన్ పాస్‌పోర్ట్ తదితర కార్యక్రమాలు బోధనకు ఆటంకాలుగా మారాయన్నారు. అక్టోబర్ 10 లోపు బోధనేతర పనులు తగ్గించకపోతే ఫ్యాప్టో ఆధ్వర్యంలో బహిష్కరణకు పిలుపునిస్తామని నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎ.సుందరయ్య మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలు, డీఏలు, పీఆర్సీ నియామకం, మధ్యంతర భృతి అంశాలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి డాక్టర్ రాజు మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్‌లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.