
లారీ ఢీకొని పాత్రికేయుడు దుర్మరణం
లారీ ఢీకొని పాత్రికేయుడు దుర్మరణం గుర్తు తెలియని భవానీ మాలధారుడు మృతి
గన్నవరం: లారీ ఢీకొని సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక గౌడపేటకు చెందిన నెక్కలపు శ్రీనివాసరావు(50) ప్రజాశక్తి విలేకరిగా, వీకేఆర్ కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కళాశాల విధులకు హాజరై తిరిగి బైక్‌పై గన్నవరం బయలుదేరారు. దుర్గాపురంలోని హెచ్‌సీఎల్ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బీవీ. శివప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసరావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా పనిచేసిన శ్రీనివాసరావుకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
హనుమాన్‌జంక్షన్ రూరల్:చైన్నె–కోల్‌కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం అంపాపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొటనంతో భవానీ మాల ధరించిన వ్యక్తి దుర్మరణం చెందాడు. అంపాపురంలోని పతాంజలి పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న టీ స్టాల్‌లో శనివారం టీ తాగి రోడ్డు దాడుతుండగా ఓ వాహనం భవానీ మాల ధరించిన వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోతుందని స్థానికుల నుంచి సమాచారం అందటంతో వీరవల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు సుమారు 55 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని, మృతుడి దుస్తుల్లో అడ్రస్‌కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనాన్ని పట్టుకునేందుకు వీరవల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

లారీ ఢీకొని పాత్రికేయుడు దుర్మరణం