
నేటి నుంచి జాతీయ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఆదివారం నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 6వ జూనియర్, సీనియర్–సీ విభాగాల నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2025–26 నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగాసన భారత్, ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జూనియర్స్ (14 నుంచి 18 ఏళ్లు), సీనియర్–సీ (45 నుంచి 55 ఏళ్లు) వారు ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. బాల బాలికల విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, గ్రూపు, ట్రెడిషనల్ స్పెసిఫికేషన్, ఆర్టిస్టిక్, సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ ఈవెంట్లతో పాటు సీనియర్–సి విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, స్పెసిఫికేషన్ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని అంతర్జాతీయ యోగాసన పోటీల్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, యోగాసన భారత్ స్పోర్ట్స్ ప్రతినిధి శ్రేయస్ మార్కండేయ, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె.రామకృష్ణ, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు.