
సామాన్య భక్తులకే పెద్దపీట
లబ్బీపేట(విజయవాడతూర్పు):దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. అందుకోసం అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా శనివారం జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశాతో కలిసి పోలీస్ కమిషనర్ ఎస్‌వి రాజశేఖరబాబు సామాన్య ప్రజలు ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నారు, వారికి క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను పరిశీలించారు. సామాన్య భక్తులు లాగా వినాయక టెంపుల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నడుచుకుంటూ పర్యవేక్షించారు. అంతరాలయం, శివాలయం ఏరియా, మహామండపం, లిఫ్ట్ మార్గం, అన్నదానం, ప్రసాదం తయారు చేసే ఏరియాలను, కనకదుర్గా నగర్, ప్రసాదం కౌంటర్లు, రథం సెంటర్, వినాయక టెంపుల్, కేశఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు అనధికారికంగా లిఫ్ట్ మార్గం ద్వారా దర్శనాలకు తీసుకువెళుతున్నారనే సమాచారం మేరకు లిఫ్ట్ మార్గాన్ని పరిశీలించి అక్కడి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. అన్నదానం జరిగే ప్రదేశం వద్ద భక్తులను ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం క్యూలైన్లను పరిశీలించి అక్కడి సిబ్బందికి భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ సంయమనం పాటించాలని ఆదేశించారు. వారి వెంట ఎస్పీ గంగాథర్, పశ్చిమజోన్ ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్ తదితరులు ఉన్నారు.