
హస్తకళలు కాపాడుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ):దేశ సంస్కృతిలో భాగమైన హస్తకళలు కనుమరుగవ్వకుండా కాపాడుకోవాలని సీఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో ‘అపిటికో’, రాష్ట్ర హస్తకళాకారుల సంస్థలు శనివారం సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ భిన్న మతాలు, జాతులు, తెగల సంస్కృతుల మధ్య దేశంలో కొనసాగతోన్న ఏకత్వానికి హస్తకళారూపాలు, నాట్య, సంగీత, సాహిత్యాలు దోహదపడతాయని పేర్కొన్నారు. తరతరాల నుంచి వస్తున్న హస్తకళల వారసత్వాన్ని భవిష్యత్ తరాలు అందిపుచ్చుకునేలా కృషి చేయాలని సూచించారు. హస్తకళల వృత్తి నైపుణ్యాన్ని, వ్యాపార ధోరణులను నేర్చుకోవాలని కోరారు. ప్రస్తుత అధునాతన వాణిజ్య పోకడలతో తమ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని తెలిపారు. మన హస్త కళాకృతులను అమెజాన్ వంటి సంస్థల సహకారంతో దేశవిదేశాల్లో ఖ్యాతి గడించాలని ఆకాంక్షించారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లాభపడాలని కోరారు. ప్రొఫెసర్ ఆదినారాయణ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి, మార్కెటొంగ్ సదుపాయాలపై హస్తకళాకారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్ పి.సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.