
దుర్గమ్మను దర్శించుకున్న చత్తీస్‌ఘడ్ వాసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు చత్తీస్‌ఘడ్ నుంచి భక్తులు విచ్చేశారు. సుమారు 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక వాహనంపై విజయవాడకు విచ్చేసి వినాయకుడి గుడి నుంచి క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తమ సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి తాము పండించిన పలు పండ్లను అందచేశారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఏటా పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి వస్తుంటామని చెప్పారు. అమ్మవారి దయతో తామంతా ఏ ఇబ్బంది లేకుండా సుఖసంతోషాలతో ఉంటున్నామని పేర్కొన్నారు. దర్శనం అనంతరం కొండపై ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. తమ గ్రామానికి చెందిన వారితో పాటు బంధువులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందచేస్తామన్నారు.