
సీఎం పర్యటనపై సమీక్ష
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల నేపథ్యంలో మూలానక్షత్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని అధికారులు బందోబస్త్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. కమాండింగ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశా, నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో శీనానాయక్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. 29వ తేదీన మూలనక్షత్రం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని సూచించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అమ్మవారి దర్శనం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చివరి ఐదు రోజుల్లో స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారని పేర్కొన్నారు. నీరు, పాలు, ఆహారం మొదలైనవి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.