
కేఎల్‌యూ ప్రొఫెసర్లకు ప్రపంచ శాస్త్రవేత్తలుగా గుర్తింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలుగా కేఎల్‌యూ ప్రొఫెసర్లకు గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత అమెరికా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఎల్సెవియర్ డేటాబేస్ విడుదల చేసిన జాబితాలో 20 మంది కేఎల్ యూ ప్రొఫెసర్లు ఉన్నారు. తమ అధ్యాపక బృందంలో 20 మంది ప్రపంచంలోని అత్యున్నత రెండు శాతం శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందారని ప్రకటించడానికి గర్వంగా ఉందని కేఎల్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ మ్యూజియం రోడ్డులోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 44 ఏళ్లుగా ఉన్నత విద్యా రంగంలో విశేష సేవలందిస్తున్న కేఎల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోందన్నారు. తమ అధ్యాపకుల శ్రమ, కృషి, పరిశోధనలపై ఉన్న నిబద్ధత వల్లే ఈ గౌరవం దక్కిందన్నారు. ఇది విద్యార్థులకు ప్రేరణాత్మకంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలతో సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతామన్నారు. కెరీర్‌లో ఉత్తమ ర్యాంకింగ్‌ను సాధించినందుకు డాక్టర్ బి.టి.పి.మాధవ్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ ఎం.నాగేశ్వరరావు, డాక్టర్ రాగిణి సింగ్, డాక్టర్ గంధర్బా స్వైన్, డాక్టర్ ఎం.జానకి రామయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. డాక్టర్ హసనే అహమ్మద్, డాక్టర్ ఎస్.షణ్ముగన్, డాక్టర్ జియా ఉర్ రెహమాన్, డాక్టర్ డి.వెంకటరత్నం, డాక్టర్ అర్పిత్ జైన్, డాక్టర్ చల్లా సంతోష్, డాక్టర్ మొహమూద, డాక్టర్ అతుల్ కుమార్, డాక్టర్ ఎస్.ఆర్.ఆర్.రెడ్డి, డాక్టర్ బి.ఉషారాణి, డాక్టర్ ప్రియారంజన్ సమల్, డాక్టర్ అతుల్ భట్టాడ్‌ను టాప్‌టూ జాబితాలో ప్రకటించిన సందర్భంగా అభినందించారు. యాంటెన్నాలు, బయోసెన్సార్లు, అయానోస్పిరిక్ సింటిలేషన్లు, థర్మల్ ఇమేజింగ్ రంగాల్లో వారి మార్గదర్శక ఆవిష్కరణలతో కేఎల్‌యూ స్కోపస్ రీసెర్చ్ డిస్కవరీ ద్వారా ప్రత్యేక గుర్తింపుతో దేశంలో మొదటి స్థానం, ప్రపంచ స్థాయిలో రెండో స్థానంలో తమ అధ్యాపక సభ్యులు నిలిచినందుకు గర్వంగా ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌డీ డీన్ డాక్టర్ బి.టి.పి.మాధవ్, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.