అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల కుటుంబాలకు పెను శాపంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. ఉచిత బస్సు వల్ల ఆటోలకు కిరాయిలు తగ్గిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్న సింగ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ పసుపులేటి సుబ్బారావు(23) మృతదేహాన్ని సీపీఎం, సీఐటీయూ నాయకులు బుధవారం సందర్శించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. అత్యధిక మంది ఆటో కార్మికులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకుని వాహనాలు కొనుగోలు చేసుకున్నారని, ఉచిత బస్సుల వల్ల కిరాయిలు లేక అప్పులు తీర్చే పరిస్థితిలేక ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. రూ.45 వేల అప్పునకు రూ.55 వేల వడ్డీ వేసి రూ.లక్ష చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీలు వేధించడం వల్లే సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.
ప్రభుత్వం కళ్లు తెరిచి ఆటో కార్మికుల ఇబ్బందులను గుర్తించాలని, వాహన మిత్ర పథకం ద్వారా రూ.25 వేల సాయం అందించాలని కోరారు. సీఐటీయూ నాయకుడు కె.దుర్గారావు, ఆటో కార్మిక సంఘం నాయకులు దుర్గావలి, కోటయ్య, జి.వి.రెడ్డి, పీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.