
కాలువలో స్నానానికి దిగిన బాలుడు గల్లంతు
గూడూరు: దసరా సెలవులు ఇవ్వడంతో స్నేహితులతో కలసి కాలువలో స్నానానికి దిగిన విద్యార్థి గల్లంతైన ఘటన మంగళవారం గూడూరులో చోటు చేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన వెలిపూడి జీవన్‌కుమార్(12) గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో స్నేహితులతో కలసి జొన్నలరేవు దగ్గర రామరాజుపాలెం కాలువలో స్నానానికి దిగారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వెళ్లిన జీవన్ కుమార్ పొద్దుపోయే వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు సావిత్రి, విజయ్‌లు స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. వారిచ్చిన సమాచారంతో జొన్నలరేవు దగ్గర గాలించగా జీవన్‌కుమార్ టీషర్టు, చెప్పులు లభించాయి. దీంతో కాలువ వెంబడి గాలించినా అతని ఆచూకీ దొరకకపోవడంతో గూడూరు పోలీసులను ఆశ్రయించారు. ఏఎస్‌ఐ స్వామేలు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఎలాంటి ఫలితం లేదని ఏఎస్‌ఐ వెల్లడించారు.