
పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరారీ
పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పటమట పోలీసు స్టేషన్‌లో పరిధిలో చోరీ కేసులో రిమాండులో ఉన్న బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్‌రెడ్డి అలియాస్ రాజు అలియాస్ బయ్యపురెడ్డి పోలీసుల నుంచి తప్పించుకోగా, వెతికి పట్టుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏఆర్‌ఏడీసీపీ కుంబా కోటేశ్వరరావు నేతృత్వంలో ఆ బృందాలు కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రభాకర్‌ను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు.
అసలేం జరిగిందంటే..
చోరీ కేసులో నిందితుడిగా ఉన్న బత్తుల ప్రభాకర్ రాజమండ్రి జైలులో రిమాండు ముద్దాయిగా ఉన్నాడు. విజయవాడ కోర్టులో సోమవారం వాయిదా ఉండటంతో తీసుకు వచ్చారు. తిరిగి తీసుకెళ్తున్న సమయంలో దేవరపల్లి గ్రామ శివారులో ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసుల కళ్లుగప్పి రాత్రి 7.30 గంటల సమయంలో ముద్దాయి పరారయ్యాడు. దీంతో నగర పోలీసులకు ఎస్కార్ట్‌గా వెళ్లిన పోలీసులు సమాచారం ఇచ్చారు.
ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సస్పెన్షన్..
చోరీ కేసులో నిందితుడు బత్తుల ప్రభాకర్‌ను విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ కె. సుగుణాకరరావు, కేజే షడ్రక్‌లను సస్పెండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించి ముద్దాయి తప్పించుకుపోవడానికి కారణమైనట్లు సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు.
వివరాల సేకరణ..
చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం ఇలా పలు ప్రాంతాల్లో నివశించాడు. ఒంటరిగా వెళ్లి పట్టపగలు ఇళ్లలో చోరీ చేయడంలో నిష్ణాతుడైన ప్రభాకర్.. హైదరాబాద్, నెల్లూరు, చైన్నె, కాకినాడల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇతనికి భార్య ఉండగా.. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
విశాఖపట్నం, చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్న వారి వివరాలు, ఫోన్‌నంబర్లను పోలీసులు సేకరించారు. వారిలో ఎవరితో టచ్‌లో ఉన్నాడో దృష్టి సారించారు. అంతేకాక ఇటీవల ప్రభాకర్‌తో సన్నిహితంగా ఉండే మరో మహిళతో కచ్చితంగా మాట్లాడి ఉంటాడని భావించి ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. కాగా ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. ఆచూకీ తెలిసినవారు రిజర్వ్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్‌కు 94407 96482కు సమాచారం ఇవ్వాలని కోరారు.