
కృష్ణానదిలో బాలుడు గల్లంతు
కృష్ణలంక(విజయవాడతూర్పు): సరదాగా కృష్ణానదిలోకి ఈతకు దిగిన ఓ బాలుడు వరద ప్రవాహానికి గల్లంతయ్యాడు. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతిఘాట్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. సేకరించిన వివరాల మేరకు కృష్ణలంక, 21వ డివిజన్‌లోని వల్లూరివారి వీధిలో నివాసం ఉంటున్న చొప్పవరపు ప్రసాద్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య గీత, ఒక కుమార్తె, ఒక కుమారుడు సాయి సందీప్(14) ఉన్నారు. సందీప్ ఐదో నంబర్ రూట్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కు దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో సందీప్ మంగళవారం మధ్యాహ్నం 1గంట సమయంలో తన ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న ఒక స్నేహితుడితో కలిసి ఆడుకుంటూ కృష్ణానది ఒడ్డున ఉన్న మర్వాడీ శివాలయం పరిసరాల్లోని పద్మావతి ఘాట్‌లోకి వెళ్లాడు. ఘాట్ మెట్లపై ధర్మాకోల్ పెట్టెను గమనించి దానితో నదిలోకి దిగి సరదాగా ఈతకొట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతటా సందీప్ ధర్మాకోల్ పెట్టెను తీసుకుని నదిలోకి దిగి సరదాగా ఈత కొడుతుండగా పెట్టె జారిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి అతను ఒడ్డుకు చేరుకోలేక నీటిలో మునిగి గల్లంతయ్యాడు.
లభించని ఆచూకీ..
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. నదిలో గల్లంతయ్యాడన్న విషయాన్ని తెలుసుకున్న బాలుడి కుటుంబంలో, ఆ వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణానది ఒడ్డుకు చేరుకున్న తల్లిదండ్రులు గల్లంతైన కుమారుడు కనిపించకపోవడంతో బోరున విలపించారు.