
ఆయుర్వేదంపై ప్రజల్లో పెరిగిన అవగాహన
ఆయుష్ విభాగం రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల్లో ఆయుర్వేదం పట్ల అవగాహన పెరిగిందని ఆయుష్ విభాగం రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి అన్నారు. మంగళవారం బీఆర్టీఎస్ రోడ్డులో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని 3కే రన్ జరిగింది. బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల ట్రాఫిక్ సిగ్నల్ నుంచి ఘంటసాల కళాశాల జంక్షన్ వరకు సాగింది. ఈ రన్‌లో ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ‘ప్రజల కోసం – ప్రకృతి కోసం ఆయుర్వేదం’ థీమ్‌తో 3కే రన్ నిర్వహించినట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ నల్లు ధరణి కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆయుర్వేదంపై మరింత ప్రచారం కల్పించాలన్నారు. రన్‌లో పాల్గొన్న వారికి సాయి సంజీవి హెర్బల్స్ – డ్రై ఫ్రూట్స్ బహుమతులను అందజేశారు. అనంతరం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. విజయవాడలోని గాయత్రి ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జెర్సీలని అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్, శారద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ నాగేశ్వర శర్మ, రాష్ట్ర విశ్వాయుర్వేద పరిషత్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ సాహితీ తదితరులు పాల్గొన్నారు.