సిఫార్సులకే ప్రాధాన్యం! | - | Sakshi
Sakshi News home page

సిఫార్సులకే ప్రాధాన్యం!

Sep 23 2025 11:21 AM | Updated on Sep 23 2025 11:21 AM

సిఫార్సులకే ప్రాధాన్యం!

సిఫార్సులకే ప్రాధాన్యం!

అమలు కాని వీఐపీ టైం స్లాట్‌ సీఎం గేటు వద్ద బారులు తీరిన భక్తులు

సామాన్య భక్తులకు తప్పని పాట్లు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే వీఐపీలకు ప్రత్యేక టైం స్లాట్‌ కేటాయించిన అధికారులు, దానిని అమలు చేయడంలో విఫలమయ్యారు. సోమవారం ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ఆరంభమైన కొద్ది గంటలలోనే ప్రముఖులు, సిఫార్సులపై వచ్చే వారు నేరుగా కొండపైకి చేరుకున్నారు. దీంతో చిన్న గాలిగోపురం, స్కానింగ్‌ పాయింట్‌తో పాటు సీఎం గేటు వద్ద వందల సంఖ్యలో భక్తులు వేచి ఉండటం కనిపించింది. ప్రముఖుల సిఫార్సుతో వచ్చిన వారు సైతం నేరుగా స్కానింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న వీవీఐపీ గేట్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.

సీపీ ఆదేశాలు బేఖాతర్‌..

మరో వైపు పోలీసు సిబ్బంది యూనిఫారంలో దర్శనాలు చేయిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని సీపీ రాజశేఖరబాబు హెచ్చరించారు. అయితే పోలీసు సిబ్బంది సాధారణంగా కనిపించే యూనిఫారం, సఫారీని వదిలి సివిల్‌ డ్రస్‌పై దర్శనాలకు రావడం కనిపించింది. పదే పదే వస్తున్న సివిల్‌ పోలీసు సిబ్బందికి ఎటువంటి ఆంక్షలు లేకుండా గేట్లను తీసి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. రూ.300, రూ.100 టికెటు క్యూలైన్లు ఖాళీగా దర్శనమివ్వడంతో సిఫార్సులపై వచ్చే వారిని ఆ క్యూలైన్‌లోకి మళ్లించాలని ఏడీసీపీ జి.రామకృష్ణ ఎన్ని సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తాము ఫలానా వాళ్ల తాలుకా అంటూ నేరుగా సీఎం గేటు వైపు నుంచే ఆలయానికి చేరుకుంటామని పట్టుబట్టారు. వీఐపీ టైం స్లాట్‌ మినహా మిగిలిన సమయంలో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తామని చెప్పిన దేవస్థాన అధికారులు ఉత్సవాల తొలి రోజే అది అమలు కానిదని తేల్చి చెప్పేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, వారి బంధుగణం వచ్చిన ప్రతి సారి అంతరాలయానికి పంపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగిల్‌ ఎంట్రీ కార్‌ పాస్‌లు..

ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఆలయ అధికారులు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఉత్సవాలలో వీఐపీలకు దేవస్థానమే వాహనాలను ఏర్పాటు చేస్తుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ముఖ్యమైన అధికారులకు వారి సొంత వాహనాలను కొండపైకి అనుమతిస్తారు. అయితే ఈ ఏడాది దేవస్థాన అధికారులు, పోలీసులు సింగిల్‌ ఎంట్రీ కార్‌ పాస్‌లను జారీ చేశారు. ఈ కార్‌ పాస్‌ ఉన్న కార్లను ఓం టర్నింగ్‌ వరకు అనుమతించడంతో అక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

సంగీత దర్శకుడు మణిశర్మకు చేదు అనుభవం

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, టీవీ నటుడు ఆటో రాంప్రసాద్‌ అమ్మవారిని దర్శించుకునేందుకు మధ్యాహ్నం 1.30గంటల సమయంలో ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అయితే ఆ సమయంలో వీఐపీ టైం స్లాట్‌ లేదని చెప్పాల్సి ఉండగా, వారిని నేరుగా దర్శనానికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సీఎం గేటు వద్ద పెద్ద ఎత్తున భక్తులు దర్శనం కోసం వేచి ఉండటంతో వారు అక్కడే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపున మణిశర్మ వచ్చారనే విషయం ఆలయ సిబ్బందికి చెప్పకుండా ఎమ్మెల్యే కార్యాలయ అనుచరులు నేరుగా సీఎం గేటు వద్దకు తీసుకెళ్లారు. దీంతో మణిశర్మకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. చివరకు సీఎం గేటు తాళాలు తీసిన తర్వాతే భక్తులతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement