
దద్దరిల్లిన ధర్నా చౌక్
మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు, వీఆర్‌ఏలు రోడ్డెక్కారు. బందరులోని కలెక్టరేట్ వద్ద నున్న ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వీఆర్‌ఏలు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్‌ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించలేదన్నారు. వీఆర్‌ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం, కార్యదర్శి చాట్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల ధర్నా
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికుల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద నున్న ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్‌ఓకు వినతిపత్రం అందించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలవకముందు విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తా మని, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు. జేఏసీ చైర్మన్ బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.