
అసెంబ్లీలో నూతన కౌలు చట్టం ఆమోదించాలి
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం
ప్రదర్శన, ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నూతన కౌలు రైతు చట్టం తీసుకువచ్చి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలని, అన్నదాత సుఖీభవ ప్రతి కౌలురైతుకూ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన, ధర్నా జరిగింది. కౌలు రైతులు రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన చేశారు. ధర్నా చౌక్‌లో రోడ్డుపై బైఠాయించి, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, కౌలురైతు సంఘం రాష్ట్ర నాయకుడు బి.బలరాం, రైతు సంఘం సీనియర్ నాయకుడు వై.కేశవరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణ్ణయ్య తదితరులు మాట్లాడారు. అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి పేషీలో వినతిపత్రం సమర్పించారు.