
బంతి పూల సోయగం
సంప్రదాయ పంటల స్థానంలో బంతి సాగు బతుకమ్మ, దీపావళి పండుగలపై ఆశలు
నారు సరఫరాతో పాటు మార్కెటింగ్ సహకారం అవసరం
పెనుగంచిప్రోలు: బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా మహిళలు బతుకమ్మ ఆటలు విశేషంగా ఆడుతున్నారు. ఈ పండుగకు పూలే కీలకం కావటంతో రైతులు పూలసాగుపై దృష్టి పెడుతున్నారు. అయితే స్థానికంగా పూలు లభించకపోతే ధరలు పెరుగుతాయి. ఇటీవల కొందరు రైతులు సంప్రదాయ పంటలైన మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేసి నష్టపోవటంతో పూల సాగును చేపట్టారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు బంతిపూల సాగు చేపట్టి లాభాలు అందుకుంటున్నారు.
వాణిజ్య పంటలకు బదులుగా...
వాణిజ్య పంటల సాగుకు అధిక పెట్టుబడులు, పలు రకాల తెగుళ్ల తో పాటు వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా పూలు, కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వీటి ద్వారా తక్కువ పెట్టు బడితో పాటు తక్కువ సమయంలో పంట చేతి కొస్తుండటంతో రైతులు పూల సాగుపై దృష్టి పెడుతున్నారు.
ఆదాయం వస్తుందనే నమ్మకం...
ప్రస్తుతం బతుకమ్మ ఉత్సవాలు, దీపావళి రానుండటంతో పూలకు మంచి గిరాకీ ఉంటుందనే ఆశ ఉందని రైతులు అంటున్నారు. నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు మండలంలో పెనుగంచిప్రోలు, కొళ్లికూళ్ల, కొ.పొన్నవరం గ్రామాలతో పాటు వత్సవాయి మండలంలోని వత్సవాయి, మక్కపేటతో పాటు పలు గ్రామాల్లో రైతులు బంతిపూల సాగు చేస్తున్నారు. నారు నాటిన రెండు నెలల్లో పూలు కోతకు వస్తాయని, రెండు నెలల వరకు ఎకరానికి రోజుకు క్వింటా పూలు వస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒకటి, రెండు కిలోలు అయితే కిలో రూ.70 నుంచి రూ.80కు తోట దగ్గరే విక్రయిస్తున్నామని, 50 కిలోలు పైన అయితే కిలో రూ.50 నుంచి రూ.60కు ఇస్తున్నామని రైతులు తెలిపారు. ఈ బతుకమ్మ సీజన్‌లో మంచి ఆదాయం వస్తుందని పక్క గ్రామాల నుంచి కూడా పూల కోసం వస్తారని అంటున్నారు.
రైతులకు ప్రభుత్వం నారు సరఫరాతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే బంతి పూల సాగు రైతుకు మరింత లాభసాటిగా ఉంటుంది. ప్రకృతి సహకరిస్తే రోజుకు ఎకరానికి క్వింటా దిగుబడి వస్తుంది. ఇప్పుడిప్పుడే ధర పెరుగుతోంది. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. నాలుగు ఎకరాల్లో బంతి పూల సాగు చేశాను. కొందరు పొలం వద్దే పూలు కొంటుండగా, మిగతా పూలు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముతున్నాను.
–గుడిమెట్ల శంకర్, రైతు, పెనుగంచిప్రోలు

బంతి పూల సోయగం