
టిప్పర్‌ను ఢీకొని పాస్టర్ ప్రేమ్ రాజ్ దుర్మరణం
ఘంటసాల: మండలం లోని లంకపల్లి జాతీయ రహదారిపై టిప్పర్‌ను ఢీకొని మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో పాస్టర్‌గా పని చేస్తున్న కె.సుబ్బారావు (ప్రేమ్ రాజ్)(41) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, సేకరించిన వివరాల మేరకు ఆదివారం రాత్రి చల్లపల్లి వైపు నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న ఇసుక టిప్పర్ మరమ్మతులకు గురి కావడంతో లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై నిలిపివేశారు. పాస్టర్ ప్రేమ్‌రాజ్ తన స్వగ్రామమైన బాపట్ల జిల్లా మోర్తోట గ్రామంలోని చర్చిలో ఆదివారం రాత్రి ప్రార్థన ముగించుకుని బుద్దాలపాలెంకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. లంకపల్లి గ్రామం వద్ద చీకట్లో ఉన్న టిప్పర్‌ను గమనించిక వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రేమ్‌రాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెనుక ఉన్న భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారు ముగ్గురిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ప్రేమ్‌రాజ్ మృతి చెందినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న ఘంటసాల ఎస్‌ఐ కె.ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్ రాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దివిసీమ పరిసర ప్రాంతాల పాస్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రేమ్ రాజ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం బుద్దాలపాలెంలో పాస్టర్ ప్రేమ్‌రాజ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
పెడన: పెడన–గుడివాడ జాతీయ రహదారిలో ఉన్న పల్లోటి ఇంగ్లిష్ మీడియం హైస్కూలు వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనదారుడు విద్యార్థుల సైకిళ్లను ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు, ద్విచక్ర వాహనదారుడు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల మేరకు పట్టణానికి చెందిన జల్లూరి గిరిష్, గుత్తి లోహిత్, షేక్ మతీన్, మహమ్మద్ ముదాసిర్ పదో తరగతి చదువుతున్నారు. స్పెషల్ క్లాసులు అనంతరం రాత్రి 8 గంటల సమయంలో నలుగురు నాలుగు సైకిళ్లపై పెడన వైపుగా బయల్దేరారు. పల్లోటి కాలనీ నుంచి ద్విచక్రవాహనంపై యార్లగడ్డ వీరబాబు మద్యం తాగి లైటు లేని ద్విచక్ర వాహనంపై వస్తూ వీరిని ఢీకొట్టి కింద పడిపోయాడు. గిరిష్ కాలికి తీవ్ర గాయం కాగా మిగిలిన ముగ్గురు విద్యార్థులకు కూడా కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. వీరబాబుకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్కూలు ఉపాధ్యాయు లు పెడనలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. పెడన పోలీసులు వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మను డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శ నానికి విచ్చేసిన పవన్‌కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
ఆలయ అర్చకుల అత్యుత్సాహం
డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆలయానికి విచ్చేసిన క్రమంలో అర్చకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మహా నివేదనలు సాయంత్రం ఆరున్నర గంటలకు పూర్తి కాగా, వెంటనే పంచహారతులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పవన్‌కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత పంచహారతులు జరిపించడంపై భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

టిప్పర్‌ను ఢీకొని పాస్టర్ ప్రేమ్ రాజ్ దుర్మరణం