
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ యశోదలక్ష్మి బదిలీ
ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం డీసీవోగా నియామకం
గన్నవరంరూరల్: మండలంలోని వీరపనేని గూడెం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై.యశోదలక్ష్మి ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం జిల్లా కో ఆర్డినేటర్ ఆఫీసర్(డీసీవో)గా బదిలీ అయ్యారు. 2023లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె వీరపనేనిగూడెం గురుకుల పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత, 10వ తరగతిలో విద్యార్థులు 500 మార్కులు పైబడి సాధించారు. పదవ తరగతిలో నూరు శాతం, జూనియర్ ఇంటర్‌లో నూరు శాతం, సీనియర్ ఇంటర్‌లో 97 శాతం ఉత్తీర్ణతతో పాటు, అత్యధిక మార్కుల సాధన ఆమె కృషికి నిదర్శనం. జిల్లాలో గురుకులాన్ని మొదటి స్థానంలో ఉంచారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరఫున హాజరయ్యారు. బెంగళూరు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్‌పై ఆమె చేసిన ఉపన్యాసం మేధావులను ఆకట్టుకుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో స్థానిక సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు భాగం చేయాలని చేసిన సూచనలు సమగ్ర శిక్షలో స్వీకరించటం ఆమె ప్రతిభకు నిదర్శనం. గడచిన మూడేళ్లలో రాష్ట్రంలోనే ఉత్తమ ప్రిన్సిపాల్‌గా, అవార్డులు, రివార్డులు ప్రభుత్వం నుంచి ఆమె స్వీకరించారు. ఉద్యోగోన్నతిపై శ్రీకాకుళం జిల్లా డీసీవోగా బాధ్యతలు చేపడుతున్న యశోదలక్ష్మిని పలు సంస్థలు అభినందించాయి.
పామర్రు: ఉమ్మడి కృష్ణాజిల్లా ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పామర్రు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చి విజేతలుగా నిలిచారని హైస్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావు అన్నారు. స్థానిక హైస్కూల్‌లో విజేతలైన విద్యార్థులను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన పోటీలలో ఏడు మెడల్స్‌ను విద్యార్థులు సాధించారన్నారు. విజయశ్రీ స్వర్ణ పతకం సాధించగా, శ్యామ్, పవన్‌కుమార్ రజత పతకాలు సాధించారని, హారిక, ఆశ్లేషిత, శర్మిక, త్రివేణి, రచన కాంస్య పతకాలు సాధించారని అన్నారు. విజేతలైన విద్యార్థులకు, వారికి శిక్షణ ఇచ్చిన పీడీ జి.మురళిని హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ యశోదలక్ష్మి బదిలీ