
బూడిద పోరుబాటకు మంత్రి వ్యాఖ్యలు దన్ను
బూడిద రవాణా, అక్రమ డంపింగ్‌లతోనే కాలుష్యం అసెంబ్లీ వేదికగా కుండబద్దలు కొట్టిన మంత్రి గొట్టిపాటి లారీ ఓనర్లకు ఉపాధి చూపుతామని స్పష్టం ఎమ్మెల్యే వసంత టెండర్ రద్దు సూచనకు అసెంబ్లీలో స్పందన కరువు
ఇబ్రహీంపట్నం: ఇటీవల ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అక్రమ బూడిద డంపింగ్, కాలుష్యం నివారణపై వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. బూడిద అక్రమ నిల్వలు, రవాణా, కాలుష్యం, ప్రజల ఆరోగ్యం, లారీ ఓనర్ల ఇబ్బందులపై మాజీ మంత్రి జోగి రమేష్ పోరుబాట పట్టి కార్యకర్తలతో కలసి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా సోమవారం బూడిదపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈ ప్రాంత సమస్యలపై లేవనెత్తిన అంశాలు కూడా ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ బూడిద పోరుబాటలో భాగంగా వెల్లడించిన కాలుష్యం, ప్రజల ఇబ్బందులనే ప్రస్తావించారనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. అవసరమైతే బూడిద టెండర్ నగదు రూ.2.8 కోట్లు తన సొంత డబ్బులు చెల్లిస్తానని చెప్పడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొండపల్లి మున్సిపాలిటీలో చిరు వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేయొద్దని, వారి ద్వారా రావాల్సిన ఆశీలు పైకం తన సొంత డబ్బులు మున్సిపాలిటీకి చెల్లిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆ నగదు చెల్లించకుండా మున్సిపాలిటీ ఆశీల ప్రక్రియనే రద్దు చేయించారనే అపప్రథ ఆయన మూటగట్టుకున్నారు. బూడిద విషయంలో ఎమ్మెల్యే వసంత లేవనెత్తిన అంశాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పైగా ఎన్టీటీపీఎస్ చెరువు నుంచి బూడిద రవాణా, జాతీయ రహదారి పక్కన బూడిద డంపింగ్ యార్డుల వలన గ్రామాల్లో కాలుష్యం పెరిగిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బూడిద పోరుబాటకు మంత్రి రవికుమార్ బలం చేకూర్చారనే చర్చ ఈ ప్రాంతంలో విస్తృతంగా జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి జాతీయ రహదారి పక్కన అక్రమ బూడిద డంపింగ్‌ల వలనే కాలుష్యం పెరిగిందని, అందువలనే ఏపీ జెన్‌కో బూడిద రవాణా ప్రైవేట్ సంస్థకు టెండర్ ద్వారా అప్పగించిందని ఇటీవల కాలంలో జోగి రమేష్ అక్రమ బూడిద పోరుబాట ద్వారా పదేపదే వెల్లడించిన విషయం తెలిసిందే.