
ఉపరాష్ట్రపతి పర్యటనకు భద్రతా ఏర్పాట్ల పరిశీలన
విమానాశ్రయం(గన్నవరం): ఈ నెల 24వ తేదీన ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విజయవాడ పర్యటన సందర్భంగా సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సీఆర్పీఎఫ్ డీఐజీ కమలేష్ సింగ్ నేతృత్వంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, రాష్ట్ర ఇంటిలిజెన్స్ భద్రతా విభాగం డీఐజీ హఫీజ్, కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేయాలని కమలేష్ సింగ్ సూచించారు. ఉపరాష్ట్రపతి పర్యటించే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు విభాగంతో కేంద్ర భద్రతా దళాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, బాంబ్, డాగ్ స్క్వాడ్‌లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఉపరాష్ట్రపతి ఈ నెల 24న సాయంత్రం 4.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని రోడ్డుమార్గం ద్వారా ఐదు గంటలకు విజయవాడ చేరుకుని శ్రీకనకదుర్గమ్మను దర్శించుకుంటారని కలెక్టర్ తెలిపారు. అనంతరం పున్నమి ఘాట్‌ను సందర్శించిన తర్వాత 7.20 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని తిరుపతి బయలుదేరి వెళ్తారని చెప్పారు. విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి పోలీసు గౌరవ వందనం ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ రహదారి మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. సదరు మార్గంలో రహదారిపై గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.ఎల్.కె.రెడ్డి, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధర్మబీర్ జకర్, అసిస్టెంట్ కమాండెంట్ తేజ్ బహదూర్, డీపీఓ డాక్టర్ జె.అరుణ, డీఎస్‌ఓ మోహన్‌బాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.