
గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం
కంచికచర్ల: ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగులో పడి ఆదివారం గల్లంతయిన యువకుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సోమవారం బయటకు తీశారు. ఎస్‌ఐ పి.విశ్వనాథం కథనం మేరకు కంచికచర్ల నేషనల్ హైవే సమీపంలో ఎగువన కురిసిన వర్షాలకు ఆదివారం నల్లవాగు పొంగి పొర్లింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నల్లవాగులో మండలంలోని బత్తినపాడు గ్రామానికి చెందిన కామా శ్రీనివాసరావు(35) కంచికచర్ల నుంచి స్వగ్రామమైన బత్తినపాడుకు బైక్‌పై బయలుదేరాడు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా బైక్‌ను వేగంగా వాగులో నడిపాడు. దీంతో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెతుకులాట ప్రారంభించారు. బైక్ మాత్రమే దొరికింది. గల్లంతయిన శ్రీనివాసరావు ఆచూకీ తెలియలేదు. ఈ విషయం గురించి ఎన్డీఆర్‌ఎప్ బృందానికి సమాచారం అందించగా వారు సోమవారం ఉదయం 6 గంటల నుంచి నల్లవాగులో వెతుకులాట ప్రారంభించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటలకు గల్లంతయిన శ్రీనివాసరావు మృతదేహాన్ని కనుగొన్నారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని చూసిన బంధువులు, కుటుంబసభ్యులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య ఉన్నారు. పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.