
మద్యం షాపులో ఘర్షణ.. వెల్డర్ మృతి
పెనమలూరు: మద్యం షాపులో ఇద్దరి మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తి బీరు సీసాతో దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు..కృష్ణా జిల్లా యనమలకుదురు వినాయక్‌నగర్‌కు చెందిన వెల్డర్ అవనిగడ్డ సత్యనారాయణ(34)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం అతడు కానూరులో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్‌ఎల్‌టీ మద్యం షాపునకు వెళ్లాడు. అక్కడ యనమలకుదురుకి చెందిన కార్పెంటర్ దేవరపల్లి భవానీ శంకర్, ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే అయ్యప్ప మద్యం తాగుతున్నారు. అక్కడే మరో పక్కన యనమలకుదురుకు చెందిన మోకా నాగరాజు, నాగశ్రీను కూడా మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలో భవానీ శంకర్‌కు, నాగరాజుకు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దిగారు. నాగరాజుతో భవాని శంకర్ కలపడుతుండగా సత్యనారాయణ గొడవ వద్దని వారిని వారించాడు. గొడవ పెరగడంతో సత్యనారాయణ గొడవపడుతున్న నాగరాజును విడదీసి పక్కకు తీసుకువెళ్లే యత్నం చేశాడు. ఈలోగా భవానీశంకర్ ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడంతో అది సత్యనారాయణ తలకు బలంగా తగిలింది. ఆయన తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.