
ప్రమాదవశాత్తు రూ.10 లక్షల అద్దాలు ధ్వంసం
ఆటోనగర్(విజయవాడతూర్పు): అద్దాల లోడుతో వెళ్తున్న లారీలోని అద్దాలు ప్రమాదవశాత్తు కిందపడిన సంఘటన శనివారం రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద జరిగింది. ఈ సంఘటనలో రూ.10 లక్షల నష్టం సంభవించింది. ట్రాఫిక్ సీఐ రమేష్‌కుమార్ వివరాల మేరకు.. మద్రాస్ నుంచి నందిగామ వెళ్తున్న అద్దాల లారీ రామవరప్పాడు రింగ్ వద్దకు రాగానే లారీకి ఇరువైపులా అమర్చిన కర్రలు పక్కకు ఒరగడంతో ఒక్కసారిగా లారీలో ఉన్న సరకు కొంత కిందపడడంతో పాటు లారీ దెబ్బతింది. సగానికి పైగా అద్దాలన్నీ పూర్తిగా పగిలిపోయాయి. అద్దాలు పనికి రాకుండా పోయాయని సీఐ చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో జేసీబీతో పగిలిపోయిన అద్దాలను నగరపాలకసంస్థ వారితో చెత్త యార్డుకు తరలించామన్నారు. లారీకి ఇన్సూరెన్స్ ఉందని, సకాలంలో సిబ్బంది సహకరించడం వల్ల ట్రాఫిక్‌ను నియంత్రించామని సీఐ చెప్పారు.