
యువ పరిశోధకులు కొత్త ఆలోచనలతో ముందుకురావాలి
పెనమలూరు: యువ పరిశోధకులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి కూనా రాంజీ అన్నారు. గంగూరు ధనేకుల ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం జాతీయ స్థాయిలో ఇన్నోవేటివ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపకులపతి రాంజీ మాట్లాడుతూ ప్రపంచస్థాయిలో సవాళ్లను ఎదుర్కొవటానికి పరిశోధనలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులు చదివితే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చాటిన వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కాలేజీ డైరెక్టర్ డీఆర్‌కేఆర్ రవిప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కడియాల రవి, డీన్లు ఆర్.సత్యప్రసాద్, రాజేష్ గోగినేని, ఈడూకేర్ ప్రతినిధులు పి.వెంకట రమేష్, సంతోష్, కోఆర్డినేటర్ డాక్టర్ కోనేరు సౌమ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.