
నిరసన తెలిపితే 400 మందిపై కేసులా?
ఆ పోలీసు అధికారులపై విచారణ జరపండి
చిలకలపూడి (మచిలీపట్నం): ప్రజాహితం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మచిలీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు శాంతియుతంగా వెళ్తే 400 మందిపై కేసులు నమోదుచేయడం ఏమిటని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ఇంత మందిపై పదేళ్ల శిక్షకు సంబంధించిన కేసులు నమోదు చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూడలేదని అన్నారు. నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే విధానమని ప్రశ్నించారు. మెడికల్ కళాశాల నిర్మాణం ఎంత వరకు జరిగింది? అక్కడ ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజెప్పేందుకే తాము వెళ్లామని నాని చెప్పారు. పేద విద్యార్థులకు మేలు చేకూర్చేలా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలల నిర్మాణం పూర్తిచేసి కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఫీజులతో వచ్చే మొత్తంతో కళాశాలల నిర్వహణ చేసేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. తాము అధికారంలోకి వస్తే మెరిట్ పద్ధతిన సీట్లు అందిస్తామని లోకేశ్ ప్రగల్భాలు పలికారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేపడితే ఏకంగా 400 మందిపై, పదేళ్లు శిక్షపడేలా సెక్షన్లు నమోదుచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల కోసం తాము పోరాటం చేసేటప్పుడు ఎన్నిరోజులైనా శిక్ష అనుభవిస్తామని స్పష్టంచేశారు. ఇప్పుడు తమపై పెట్టిన కేసుల్లాగే జనసేన, టీడీపీ అరాచకాలపై కూడా కేసులు నమోదు చేయాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.
ఇక పరిపాలనాధికారికి చుట్టూ ఉన్న వ్యవస్థ వాస్తవాలను చూడనివ్వదని పేర్ని నాని అన్నారు. ఏడాదిన్నర కాలంగా బందరులోని స్టేషన్ హౌస్ అధికారులు పొలిటికల్ వ్యవస్థకు దారుణంగా కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఒకాయన పేకాట శిబిరాలు నిర్వహిస్తాడని, మరొకాయన హత్యలు జరిగితే నిందితులకు కొమ్ముకాస్తాడని, మరొకరు అక్రమంగా డీజిల్ విక్రయాల దందా చేస్తున్నారని వివరించారు. వారిపై కూడా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.